NEWS

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చెయ్యండి. ఎంపీడీఓ విశ్వనాధ్

కాకినాడ : ప్రభుత్వ ఉద్యోగులకు శరాఘాతంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చెయ్యాలని జిల్లా సిపిఎస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, అంబాజీపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగుల పోరాటం ఆఖరు మజిలీకి చేరిందని, ప్రభుత్వంతో జరుపుతున్న ఆఖరి పోరాటంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరు పాల్గొని చలో విజయవాడ కార్యక్రమాన్ని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం పికెటింగ్ ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సిపిఎస్ భూతం సెప్టెంబర్ 1, 2004లో అమలాలలోకి వచ్చిందని, అందుకే సెప్టెంబర్ 1 ఉదోగుల పాలిట “బ్లాక్ డే” అని అన్నారు. సిపిఎస్ భూతాన్ని తరిమికొట్టే వరకు తమ ఉద్యమ పోరు ఆగదని అన్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 1 శనివారం సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరు సామూహిక సెలవులు (మాస్ కేజువల్ లీవ్) పెట్టి వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీడీఓ విశ్వనాధ్ అన్నారు. రాష్ట్రంలో సుమారు లక్ష డెబ్భై వేల మంది, జిల్లాలో పద్దెనిమిది వేలమంది సిపిఎస్ ఉద్యోగులు ప్రభుత్వంలో తమ సేవలందిస్తున్నారని కానీ వీరెవ్వరికి తమ ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం పరంగా ఎటువంటి ఆర్ధిక భద్రత లేకపోవడాన్ని తప్పుబట్టారు. శాసన సభ్యులుగా కేవలం ఐదు సంవత్సరాలు పదవులు అనుభవించి, మాజీలుగా జీవితాంతం వేలాది రూపాయిలు పింఛను సదుపాయం పొందుతుంటే తప్పు లేదుగాని, ఎన్నో సంవత్సరాలు ఉద్యోగులు ప్రజలకు సేవలందిస్తూ, విశ్రాంతి సమయంలో పింఛను పొందడానికి అర్హత లేదాని ప్రశ్నించారు. పింఛను బిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కని విశ్వనాధ్ పునరుద్ఘాటించారు. ఇప్పటికే సుమారు 180 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ మరణిస్తే కుటుంభం సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్ధిక సహకారం అందక రోడ్డున పడ్డారని గుర్తు చేసారు. గత నాలుగు సంవత్సరాల నుంచి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చెయ్యమని ఉద్యోగులు ఎన్నో ఉద్యమాలు, సత్యాగ్రహ దీక్షలు చేసిన ప్రభుత్వం స్పందించలేదని, అందుకే తప్పని పరిస్థితులలో ఉద్యోగులు అందరు ఒక్క రోజు సామూహిక సెలవులు పెట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. తమది ధర్మ పోరాటమని, ప్రభత్వం స్పందించి సిపిఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలని విశ్వనాధ్ కోరారు. లేనిపక్షంలో ఉద్యోగులందరు “పెన్ డౌన్” కార్యక్రమం చెప్పట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసారు. చలో విజయవాడ కార్యక్రమం, రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వస్తుందని విశ్వనాధ్ హెచ్చరించారు.

ధన్యవాదములు

తూతిక శ్రీనివాస విశ్వనాధ్
గౌరవ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ సంక్షేమ సంఘం, తూర్పు గోదావరి జిల్లా,
మండల పరిషద్ అభివృద్ధి అధికారి
అంబాజీపేట, 7675924666

Please emailus For updates and corrections, Publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics