NEWS

సముద్ర వర్తక, వ్యాపార లాభాలలో మత్సకారులకు ‘రాయలిటీ’ ఇవ్వాలి

ఉప్పాడ :  ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు అన్వేషణ పేరుతో సముద్ర తీరప్రాంతంలో కార్పొరేట్ సంస్థలు పెత్తనం పెరిగి, మత్సకారుల వృత్తి భద్రత వాటిల్లుతుందని, అందుకే కనీస జీవన ప్రమాణాలకు మత్సకార కుటుంబాలు దూరంగా ఉంటున్నాయని అంబాజీపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.  ప్రపంచ మత్సకార దినోత్సవం సందర్భంగా గురువారం ఉప్పాడ కొత్తపట్నం మత్సకార కాలనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశ్వనాధ్ హాజరై ప్రసంగించారు. సముద్రాన్నేనమ్ముకొని  బ్రతుకుతున్న మత్సకారులకు సముద్రంపై సర్వహక్కులు ఉన్నాయనే విషయాన్నీ గుర్తు చేస్తూ,  ప్రభుత్వ విధాన పరమైన లోపం వలన ముఖ్యంగా మత్సకారుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని సముద్రంపై కార్పొరేట్ సంస్థల    ఆధిపత్యం నానాటికి పెరిగిపోతుందని అన్నారు.  గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సముద్రంపై రవాణా, వర్తక, వ్యాపారాలు జరిపి కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్లు కూడబెడితే, అదే సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న వాడబలిజలు మాత్రం కూటికి కరువై జీవిస్తున్నారని అన్నారు.

 వ్యవసాయానికి అనుబంధ రంగంగా పిలవబడే మత్సకార రంగం లాభాలు ఆర్జిస్తున్నాయని ఒకవైపు ప్రభుత్వం గణాంకాలు చెప్తున్నా, సగటు మత్సకారుడు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నాడని అన్నారు. పేదరికంలో ఉన్న మత్సకారులకు సరైన న్యాయం జరగాలంటే సముద్రంపై జరిగే రవాణా, వర్తక, వ్యాపార లాభాలలో ‘రాయలిటీ’ పేరుతో ప్రతి మత్సకార కుటుంబాలకు వాటా పంచాలని విశ్వనాధ్ డిమాండ్ చేసారు. ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు అన్వేషణ పేరుతో సముద్ర తీరప్రాంతంలో కార్పొరేట్ సంస్థలు జరుపుతున్న డ్రిల్లింగ్ వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాకుండా, జీవ వైవిద్యం కూడా దెబ్బతింటుందని ఈ విషయంలో ప్రతి పౌరుడు స్పందించాలని అన్నారు. 

పిఠాపురం నియోజకవర్గంలో మత్సకారుల పరిస్థితి అన్ని విషయాలలో దయనీయంగా ఉందని, మత్సకారుల ‘సముద్ర రాయలిటీ’ ఉద్యమం పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ తీరప్రాంతం నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో మత్సకారులకు అవగాహనా లేనందున త్వరలో ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కోనపాపేట మత్సకార నాయకులు, యువకులు, మహిళలతో సామజిక చైతన్య కార్యక్రమాలు చేపడతానని విశ్వనాధ్ అన్నారు. .  

తూతిక శ్రీనివాస విశ్వనాధ్, అంబాజీపేట మండల పరిషద్ అభివృద్ధి అధికారి, 7675924666
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics