Competitive

జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య 

కె.ఎస్.తిమ్మయ్య,
(1906 మార్చి 30 – 17 December 1965)

జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య భారత సైన్యంలో ఒక విశిష్టమైన సైనికుడు. ఇతడు 1957 నుండి 1961 వరకు భారత చైనా దేశాలమధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో భారత సైన్యంలో ఛీఫ్ ఇన్ ఆర్మీ స్టాఫ్‌గా కీలకమైన సేవలను అందించారు.  రెండవ ప్రపంచ యుద్ధం పదాతిదళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు. ఇతడు భారత సైన్యం అందించిన విశిష్ట అధికారిగా గుర్తింపు పొందాడు. కొరియా యుద్ధం తరువాత ఇతడు యుద్ధ ఖైదీలను వారి వారి దేశాలకు తిరిగి పంపే పనిలో ఐక్యరాజ్య సమితి విభాగానికి నాయకత్వం వహించారు.  ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తరువాత 1964 జూలై నుండి డిసెంబరు 1965 వరకు సైప్రస్ దేశంలో ఐక్యరాజ్యసమితి శాంతి సంరక్షక దళానికి కమాండర్‌గా నియమించబడ్డారు. సైప్రస్ లో 17డిసెంబరు 1965లో మరణించారు.

కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా (పూర్వపు పేరు కూర్గ్) మద్దికెరి గ్రామంలో 1906, మార్చి 30వ తేదీన తిమ్మయ్య సీతమ్మ దంపతులకు జన్మించారు.   మెరుగైన విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో తన 8వ యేటనే తమిళనాడు రాష్ట్రం కూనూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరారు. ఆ తర్వాత బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూలులో చదివారు. ప్రాథమిక విద్య ముగిసిన తరువాత  డెహ్రాడూన్ లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలటరీ కాలేజీ(RIMC)లో చేరారు. అక్కడి నుండి పట్టా పొందిన తరువాత  ఇంగ్లాండులోని రాయల్ మిలటరీ కాలేజీకి తదుపరి శిక్షణ కోసం ఎంపిక చేయబడ్డారు.

1957, మే 7న 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలను చేపట్టారు. 1959లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ తో ఏర్పడిన విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. కానీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తన రాజీనామాను తిరస్కరించడంతో పదవిలో కొనసాగారు.  35 ఏళ్ల మిలటరీ సర్వీసు పూర్తి చేసుకుని 1961 మే 7న పదవీ విరమణ చేశారు.

భారత సైన్యం నుండి పదవీ విరమణ తరువాత ఐక్యరాజ్యసమితి ఇతని సేవలను మరోసారి ఉపయోగించ తలపెట్టి ఇతడిని సైప్రస్‌లో ఐక్యరాజ్యసమితి సేన(UNFICYP)లకు కమాండర్‌గా జూలై 1964లో నియమించింది. ఇతడు ఆ పదవిలో ఉన్న సమయంలోనే1965, డిసెంబరు 17 న మరణించాడు. ఇతని పార్ధివ దేహాన్ని అంత్యక్రియలకోసం బెంగళూరుకు తరలించారు. ఇతని స్మృత్యర్థం బెంగళూరు, పూనే, సైప్రస్‌లోని లార్నకా నగరాలలో కొన్ని వీధులకు జనరల్ తిమ్మయ్య రోడ్ అని నామకరణం చేశారు. 1966లో రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఇతని స్మారక తపాలాబిళ్ళను విడుదల చేసి గౌరవించింది.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in.

Topics