NEWS

​విద్యావంతులు.. దారితప్పుతున్నారు! -కె సుప్రజ- DSP

రాజధాని పరిధిలోని గుంటూరు, విజయవాడ నగరాలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యాచారం, హత్య, దొంగతనాలు, దోపిడీలు,  గంజాయి విక్రయాలు, క్రికెట్‌ బెట్టింగ్‌, సైబర్‌ నేరాలు ఇలా అన్నింటిలోను  ఉన్నత చదువులు చదువుతున్నవారు పోలీసులకు పట్టుబడుతున్నారు.  మత్తుకు బానిసలై మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలోనూ వీరే అధికంగా ఉండటం ఇటు పోలీసులను ..అటు వారి తల్లిదండ్రులను    ఆందోళనకు గురిచేస్తోంది.

గుంటూరుకు చెందిన ఓ యువతిపై ఒంగోలులో ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలటం చర్చనీయాంశంగా మారింది.

తాడికొండలో ఓ తల్లి.. తన కుమారుడు చదువుకోకుండా చెడు అలవాట్లకు లోనవుతున్నాడని తెలిసి ప్రశ్నించింది. దీనితో కొడుకు ఆగ్రహంతో అమ్మ గొంతుకోశాడు. అతను హైదరాబాద్‌లో బీఫార్మసీ చదువుతున్నాడు

విజయవాడలో ఇటీవల జరిగిన ఓ దొంగతనం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా వారిలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు.

కారణాలు ఇవే

చెడు స్నేహాలకు అలవాటు పడటం, జల్సాలు, షికార్ల కోసం అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే క్రమంలో గొలుసు చోరీలకు అలవాటుపడుతున్నారు. కొందరు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. మరికొందరు సిగరెట్‌, గుట్కాలతోపాటు గంజాయి మత్తుకు బానిసలై వాటి ఖర్చుల కోసం డబ్బులు లేక సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు.

గంజాయితోనూ

గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇటీవల గంజాయితో పట్టుబడిన యువకులను పోలీసులు విచారిస్తే ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వెబ్‌సైట్లు చూడటం, చెడు స్నేహాల ప్రభావంతో యువతులపై అత్యాచారాలకు వడిగట్టడమేకాకుండా వాటిని చరవాణిల్లో బంధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

కుటుంబ పెద్దలు ఏం చేయలేని పరిస్థితి

నరసరావుపేటకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇళ్లల్లో కళాశాలకు వెళుతున్నామని చెప్పి గుంటూరు వచ్చి గొలుసు చోరీలు చేసి ఆ నగదుతో మద్యం సేవించడం, లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు, జల్సాలకు పోతూ అనేక రకాల నేరాలు చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇంట్లో తల్లిదండ్రులను, పెద్దలను ఏమార్చి నేరప్రవృత్తికి అలవాటుపడుతున్నారు. పిల్లల ప్రవర్తనపై అనుమానం వచ్చి ప్రశ్నిస్తుంటే కొంతమంది కిరాతకులు ఏకంగా తల్లిదండ్రులపైనే దాడులకు దిగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

పోలీసులు చర్యలు చేపడుతున్నా మారని తీరు

క్రికెట్‌ బెట్టింగ్‌లో గుంటూరు జిల్లాలో ఒకేసారి 100మందికిపైగా యువకులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టుబడితే అప్పటి రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు మానవతా దృక్పథంతో కౌన్సిలింగ్‌ నిర్వహించి వదిలిపెట్టారు. త్రిబుల్‌రైడింగ్‌, స్నేక్‌, ర్యాష్‌డ్రైవింగ్‌ చేస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులను గత అర్బన్‌ ఎస్పీ విజయరావు, ట్రాఫిక్‌ డీఎస్పీ సుప్రజలు మానవతా దృక్పథంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. యువత, విద్యార్థులు తమ జీవితాలు బంగారుమయం చేసుకోవాలని ఉన్నతంగా ఎదగాలనే యోచనతో పోలీసులు తమవంతు చర్యలు తీసుకుంటున్నా వారి తీరు మారకపోవడం ఆవేదన కలిగిస్తుంది.

చెడు స్నేహాలతో దారి తప్పుతున్నారు

విద్యార్థులు చెడు స్నేహాలతో దారితప్పుతున్నట్లు గత కేసుల దర్యాప్తు క్రమంలో గుర్తించాం. మద్యం, గంజాయిలకు అలవాడుపడటం, విలాసవంతంమైన జీవితం గడపటానికి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే యోచనతో గొలుసు చోరీలు, దొంగతనాలు పాల్పడుతున్నట్లు పలు కేసుల విచారణలో తేలింది. సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వారిపై కనిపిస్తుంది. చదువుకునే వయస్సులో చెడుస్నేహాలతో నేరాలకు పాల్పడి చేతులారా జీవితాలు పాడుచేసుకుంటున్నారు. ఒక లక్ష్యంపెట్టుకొని ఆ దిశగా కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించండి. తల్లిదండ్రుల కలలను నెరవేర్చండి.

ఏఎస్పీ వైటీ నాయుడు, గుంటూరు

తల్లిదండ్రులు, అధ్యాపకులు బాధ్యతగా ఉండాలి

తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో స్నేహితులుగా మెలుగుతూ వారు ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలి. వారు చదువుకునే విద్యాసంస్థల్లోని అధ్యాపకులు వారికి నైతిక విలువలు నేర్పాలి. నేరాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడితే జీవితం అంధకారమవుతుందని కొందరి జీవితాలను ఉదాహరణలుగా చెప్పాలి. కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి వివరించాలి. తండ్రుల కష్టాన్ని వారికి తెలిసేలా చెప్పాల్సిన బాధ్యత అధ్యాపకులదే. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో మంచి, చెడు చెబుతుండాలి. వారికి ఉండే సమస్యలపై చర్చించాలి. దారితప్పే అవకాశాలు ఉన్నప్పుడు వారిని గైడ్‌ చేయాలి. అప్పుడప్పుడు కళాశాలకు వెళ్లి తమ పిల్లల చదువు, నడవడిక అతని స్నేహితుల గూర్చి తెలుసుకోవాలి.

– కె. సుప్రజ, డీఎస్పీ

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics